Karnataka Elections | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అనేక తర్జనర్జనల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 189 అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. 52 మంది కొత్త అభ్యర్థులకు చోటిచ్చింది. 189 మందిలో మహిళలు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. సీఎం బసవరాజ్ బొమ్మై మరోసారి షిగ్గాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 2008 నుంచి ఆయన ఈ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించి కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు ఖరారు చేసింది. మాజీ సీఎం జగదీశ్ షెట్టర్, సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప పేర్లు మొదటి జాబితాలో లేవు.
కర్ణాటక కాంగ్రెస్‌లో మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక నేతలు. వీరిద్దరిపై పోటీకి ఇద్దరు మంత్రులను బీజేపీ బరిలో దింపింది. వరుణలో సిద్ధరామయ్యపై వీ సోమన్నను, కనక్పురలో డీకే శివకుమార్‌పై ఆర్ అశోకను అభ్యర్థులుగా ఖరారు చేసింది. సోమన్న వరుణతో పాటు చామరాజనగర్‌లో, అశోక కనకపురతో పాటు పద్మనాభనగర్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఇద్దరికీ రెండేసి సీట్లను కేటాయించడం ద్వారా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌పై గెలుపు కష్టమేనని బీజేపీ అంగీకరించినైట్టెంది.
తెల్లారి లేస్తే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని నీతులు చెప్పే బీజేపీ చేతల్లో మాత్రం చిత్తశుద్ధిని చూపించలేదు. కర్ణాటకలో బీజేపీ నేతల వారసులకు టికెట్లు దక్కాయి. యెడియూరప్ప కుమారుడు విజయేంద్రను శికారిపుర అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. మంత్రి ఆనంద్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ సింగ్‌ను కంప్లి నుంచి బరిలో నిలిపింది.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేశ్ జార్కిహోళికి గోకక్ టికెట్ ఇచ్చింది. ఐఎంఏ కుంభకోణం కేసులో నిందితుడు, విశ్రాంత కేఏఎస్ అధికారి ఎల్సీ నాగరాజ్‌కు మధుగిరి టికెట్ ఇచ్చింది. హిజాబ్‌ను నిషేధించాలని ప్రచారం చేసిన యశ్పాల్ సువర్ణకు ఉడిపి టికెట్టు దక్కింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘుపతి భట్‌ను పక్కనపెట్టి మరీ యశ్‌పాల్‌ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.