Election Manifesto : అస్సాం (Assam) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో బీజేపీ మంగళవారం ఎన్నికల మ్యానిఫెస్టో (Election Manifesto) ను విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి పౌర స్మృతి (UCC)తోపాటు మహిళలకు నెలకు రూ.3 వేలు అందిస్తామంటూ పలు హామీలు ప్రకటించింది. మొత్తం 31 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma), ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Niramala Sitaraman) సహా పలువురు నేతలు విడుదల చేశారు.
కాగా 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్, ఎస్టీ ప్రాంతాలు మినహా అస్సాం అంతటా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామనేది మ్యానిఫెస్టోలోని ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అస్సాంను వరదరహిత రాష్ట్రంగా మార్చేందుకు చర్యలు తీసుకోవడం అనేది రెండో ముఖ్యాంశం.
అదేవిధంగా బంగ్లాదేశీ మియాలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం, అరుణోదయ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున అందజేయడం, ఐదేళ్లలో 2 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, లఖ్పతి దీదీ పథకం కింద 40 లక్షల మంది మహిళలకు ప్రోత్సాహకాలు అందించడం అనేవి మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలుగా ఉన్నాయి.