పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉప ప్రధాని కావాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆకాంక్షించారు. (Nitish Kumar As Deputy PM) ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ తర్వాత బీహార్ నుంచి రెండవ డిప్యూటీ పీఎంగా నితీశ్ కుమార్ను చూడాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు నితీశ్ కుమార్ క్యాబినెట్లో పని చేసిన బీజేపీ సీనియర్ నేత అశ్విని కుమార్ చౌబే, గురువారం మీడియాతో మాట్లాడారు. నితీశ్ కుమార్ను డిప్యూటీ పీఎంగా చూడాలని ఉందని చెప్పారు. ‘ఎన్డీయేలో నితీశ్ కుమార్ సహకారం ఎంతో ఉంది. సంకీర్ణ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేతులను బలోపేతం చేస్తున్నారు. ఆయనను ఉప ప్రధానిగా చేయాలన్నది నా వ్యక్తిగత కోరిక. ఆ కోరిక నెరవేరితే బాబు జగ్జీవన్ రామ్ తర్వాత రెండో కుమారుడిని ఆ హోదాలో బీహార్ నేల చూస్తుంది’ అని అన్నారు.
కాగా, ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో వరుసగా ఐదోసారి ప్రభుత్వాన్ని నడపడానికి 74 ఏళ్ల నితీశ్ కుమార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆయన ఫిరాయింపులతో బీజేపీ విసిగిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో సముచిత స్థానంతో నితీశ్ కుమార్కు గౌరవప్రదంగా నిష్క్రమణ పలకాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.