BJP | న్యూఢిల్లీ, జూన్ 10: బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ మహిళలపై లైంగిక వేధింపులతోపాటు అనేక నీచమైన కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరెస్సెస్ సభ్యుడు శంతను సిన్హా ఆరోపించారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై మాలవీయ లీగల్ టీం సోమవారం స్పందించింది.
మాలవీయపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పడంతోపాటు అన్ని సామాజిక మాధ్యమాల నుంచి మూడు రోజుల్లో ఆ వ్యాఖ్యలను తొలగించాలని లేదా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఒక నోటీసు పంపింది. ముందుగా మాలవీయకు కలిగిన మానసిక క్షోభకు, గౌరవ భంగానికిగాను నష్టపరిహారం కింద రూ.10 కోట్లు డిమాండ్ చేసింది. బీజేపీ నేత రాహుల్ సిన్హాకు బంధువు అయిన శంతను సిన్హా ఇటీవల ఫేస్బుక్లో మాలవీయకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టారు.
మాలవీయ పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని, అనేక నీచమైన చర్యలలో భాగస్వామి అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. తక్షణం మాలవీయ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మాలవీయ చేతిలో లైంగిక దోపిడీకి గురైన మహిళలకు బీజేపీ న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేథ్ డిమాండ్ చేశారు. ప్రధానిగా మోదీ ప్రమాణం చేసిన 24 గంటల్లోనే ఓ ప్రముఖ బీజేపీ నేతపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. మాలవీయ చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు.
వ్యాఖ్యలు ఉపసంహరించుకోను: సిన్హా
ఫేస్బుక్లో తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని శంతనుసిన్హా స్పష్టం చేశారు. కొందు బీజేపీ నేతలు తమ అధికార పదవులను కాపాడుకోవడం కోసం తమ ఢిల్లీ బాస్‌లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఫేస్బుక్లో తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, సామాజిక మాధ్యమం నుంచి వాటిని తొలగించలేదని, ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనకు అందిన లీగల్ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కొంత సమయం కావాలని కోరానని తెలిపారు.