న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ఓ ఆకతాయి అని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. పార్లమెంట్ భవనం వద్ద విలేకరులతో ముచ్చటిస్తూ రాహుల్ వ్యాఖ్యల నేపధ్యంలో అమిత్ మాలవీయ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతను ఎద్దేవా చేశారు. మీరు ప్రభుత్వం కోసం పనిచేస్తారా అని రిపోర్టర్‌ను ప్రశ్నించిన వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేయడంపై అమిత్ మాలవీయ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్‌ను ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ప్రశ్నించిన రిపోర్టర్‌ను ఆకతాయి రాహుల్ గాంధీ గద్దించారని అన్నారు. చర్చలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్, రాహుల్ గాంధీకి తెలుసునని, సంప్రదింపులు జరిపే సమర్ధత వారికి లేదని బీజేపీ నేత ట్వీట్లో రాసుకొచ్చారు. విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోందని అంతకుముందు రాహుల్‌ను విలేకరి ప్రశ్నించగా సభను గాడినపెట్టడం ప్రభుత్వ బాధ్యతని, విపక్షానిది కాదని బదులిస్తూ మీరు ప్రభుత్వం కోసం పనిచేస్తారా అని నిలదీశారు.