జైపూర్: దేశ వ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సోదరులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు బీజేపీ నాయకుడు. (NEET Leak Case) బీజేపీ యుజన విభాగం నాయకుడు దినేష్ బివాల్, అతడి సోదరుడు మంగీలాల్ బివాల్, హర్యానాకు చెందిన ఒక వ్యక్తి నుంచి నీట్ 2026కు సంబంధించిన 120 ప్రశ్నల గెస్ పేపర్‌ను అందుకున్నారు. ఆ గెస్ పేపర్‌ను రూ.15 లక్షలకు వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సికర్‌లోని పలువురు విద్యార్థులకు దానిని విక్రయించినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు.
కాగా, నీట్ పేపర్ లీక్‌పై దర్యాప్తు చేపట్టిన సీబీఐ, జైపూర్ జిల్లాలోని జమ్వా రామ్‌గఢ్‌లో సోదరులైన దినేష్ బివాల్, మంగీలాల్ బివాల్‌ను అరెస్ట్ చేసింది. వారిని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఢిల్లీకి తరలించినట్లు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీస్ అధికారి తెలిపారు. గత ఏడాది దినేష్ కుటుంబానికి చెందిన ఐదుగురు కూడా నీట్ పరీక్షలో ఎలా ఉత్తీర్ణులయ్యారనే విషయంపై సీబీఐ విచారణ జరుపుతున్నదని వివరించారు.
మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన దినేష్ బివాల్ స్థానిక బీజేపీ యువజన విభాగం నేత. అతడి ఫేస్బుక్ ప్రొఫైల్‌లో పలువురు బీజేపీ నేతలతో కలిసి ఉన్న ఫొటోలున్నాయి. 2021 నాటి రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌తో పాటు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర పాల్ మీనాతో దిగిన తాజా ఫొటోలు కనిపించాయి. మూడు రోజుల కిందట దినేష్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర పాల్ మీనా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేశారు.
ఈ నేపథ్యంలో దినేష్ బివాల్, మంగీలాల్ బివాల్ అరెస్ట్‌లు రాజస్థాన్‌లో రాజకీయ దుమారాన్ని రేపాయి. అధికార బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది. దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న దోషులను బీజేపీ కాపాడుతున్నదని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.