Rahul remarks | ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ముంబైలో బీజేపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. రాహుల్ పోస్టర్లను చెప్పుతో కొట్టి నిరసన ప్రకటించారు. కర్ణాటకలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. బ్రిటీషర్ల వద్ద వీర్ సావర్కర్ డబ్బులు తీసుకుని వారికి సహకరించారని ఆరోపించారు.
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. ముంబైలో ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాహుల్‌గాంధీ పోస్టర్లను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు రామ్ కదమ్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు శోచనీయమని, దిగ్భ్రాంతికరమని అన్నారు. దీనికి రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ఆయనన్నారు. వీర్ సావర్కర్‌ను తిట్టినా, ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా ఉద్దవ్ ఠాక్రేకు పౌరుషం రావడం లేదని మండిపడ్డారు. ఉద్దవ్ ఠాక్రే హిందుత్వాన్ని వదిలిపెట్టాడని, బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతంలో రాజీపడ్డాడని విమర్శించారు.
కాగా, రాహుల్ గాంధీకి భారతీయ చరిత్రగానీ, కాంగ్రెస్ చరిత్రగానీ తెలియకపోవడం వల్లనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. , రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఫడ్నవిస్.. వీర్ సావర్కర్‌ను రాహుల్ మళ్లీ అవమానించడం క్షమించరానిదన్నారు. వెంటనే రాహుల్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.