బలియా: బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్‌లో దళిత ఇంజినీర్‌పై ఆయన కార్యాలయంలోనే దాడి జరిగింది. బలియాలో విద్యుత్ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న లాల్ సింగ్‌పై బీజేపీ కార్యకర్త ఒకరు చెప్పుతో దాడి చేయడంతోపాటు కులం పేరిట దూషించాడు. శనివారం జరిగిన ఈ ఘటన గురించి బాధిత ఇంజినీర్ విలేకరులకు వివరించారు.
దాదాపు 25 మంది వ్యక్తులు తమ కార్యాలయంలోకి దూసుకువచ్చి తమ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారని ఆయన చెప్పారు. వారిలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడినని చెప్పుకున్న మున్నా బహదూర్ సింగ్ ఉన్నాడని, ఎటువంటి కారణం చెప్పకుండా అతను తనపై దాడికి దిగాడని ఆయన చెప్పారు. తన సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని వారించినప్పటికీ మున్నా సింగ్ చెప్పుతో తనను కొట్టడమేగాకుండా కులం పేరుతో దూషించాడని ఆయన తెలిపారు. తమ సిబ్బంది ఒకరు ఈ దృశ్యాలను వీడియో తీశారని తెలిపారు.