చండీఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ షేర్(Haryana Vote Share)లో పెద్దగా తేడా లేదు. కమలం పార్టీ చాలా సింపుల్ మెజారిటీతో గట్టెక్కెఇంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ పార్టీకి 39.09 శాతం ఓట్లు పడ్డాయి. వాస్తవానికి గత ఎన్నికలతో పోలిస్తే, రెండు పార్టీలకు అధిక సంఖ్యలోనే ఓట్లు పోలయ్యాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికలతో పోలిస్తే 11 శాతం ఓట్లు అధికంగా పడ్డాయి. ఈసారి బీజేపీకి కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే అధికంగా పోలయ్యాయి.
హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు దక్కాయి. అప్పుడు ఆ పార్టీ ఓట్ షేర్ 36.49 శాతం మాత్రమే. ఆ ఎన్నికల్లో 31 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి 28.08 శాతం ఓట్లు పడ్డాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. మూడవ సారి హర్యానాలో సర్కారును ఏర్పాటు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాలు తలకిందులయ్యాయి. ఆ పార్టీకి ఈసారి 37 సీట్లు దక్కాయి. ఐఎన్ఎల్డీ మూడు, ఇండిపెండెంట్లు మరో మూడు సీట్లు గెలుచుకున్నట్లు ఈసీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.
సిర్సా సీటు నుంచి ఈసారి బీజేపీ పోటీ చేయలేదు. అలాగా బివానీ సీటు నుంచి కాంగ్రెస్ పోటీపడలేదు. ఈ సారి ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ పార్టీ ఓట్ షేర్ పెరిగింది. 2019లో ఆ పార్టీకి 2.44 శాతం ఓట్లు పడగా, ఈసారి 4.14 శాతం ఓట్లు పోలయ్యాయి. జేజేపీకి మాత్రం ఘోరమైన జలక్ తగిలింది. 2019లో జేజేపీ పార్టీకి 15 శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పుడు ఆ పార్టీ 10 సీట్లు గెలుచుకున్నది. కానీ ఈసారి ఆ పార్టీకి కేవలం 0.90 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి 1.79 శాతం ఓట్లు పోలయ్యాయి. నోటా వోట్ షేర్ 0.52 శాతం నుంచి 0.38 శాతానికి తగ్గింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 5 సీట్లు గెలుచుకున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 46.11 శాతం, కాంగ్రెస్కు 43.67 శాతం ఓట్లు పడ్డాయి.