రాంచీ: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)ను జార్ఖండ్‌లో అమలు చేస్తామని తెలిపారు. (NRC In Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సోమవారం శివరాజ్ సింగ్ చౌహాన్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. జార్ఖండ్‌లో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘రోటీ, మాటి ఔర్ భేటీ’ ని రక్షించాలని తాము నిర్ణయించినట్లు చెప్పారు.
కాగా, ఒకరిని సీఎం చేయడమో లేక అధికారంలోకి రావడం కోసమో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కాదని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. జార్ఖండ్‌ను రక్షించడం కోసమేనని అన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల కారణంగా ఈ రాష్ట్ర జనాభా వేగంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సంతాల్ ప్రాంతంలో గిరిజన జనాభా 44 శాతానికి పైగా ఉండేదని తెలిపారు. అయితే చొరబాటుదారుల ప్రభావం వల్ల గిరిజన జనాభా 28 శాతానికి పడిపోయిందని చెప్పారు.
మరోవైపు సీఎం హేమంత్ సోరెన్ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ‘హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు అనుకూలంగా ఉంది. అందుకే జార్ఖండ్‌లో ఎన్నార్సీని మేం అమలు చేస్తాం. దీనిలో స్థానిక నివాసితులను నమోదు చేస్తారు. చొరబాటుదారులను గుర్తించి బయటకు పంపుతారు’ అని అన్నారు.