పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఈ నెల 6న విడుదల చేయనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ మేనిఫెస్టోను విడుదల చేయనుండగా అదేరోజు ఉత్తర గోవాలోని 20 ప్రాంతాల్లోని ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. తమ పార్టీ మేనిఫెస్టో కేవలం హామీ పత్రం కాబోదని, గోవా ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఉంటుందని బీజేపీ గోవా రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు గోవాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ప్రతి నెల రూ.6000 చొప్పున అందజేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ఒక్కో పేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏడాదికి రూ.72 వేల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. గోవాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో, కరోనా మహమ్మారి కట్టడిలో, ఉపాధి కల్పనలో బీజేపీ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. మేం నియంతలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వడంలేదని, కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం నిలుపుకోవాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా ఆప్, కాంగ్రెస్, టీఎంసీలు దీటైన పోటీ ఇచ్చేందుకు చెమటోడుస్తున్నాయి. ఇక గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.