బెంగళూరు, అక్టోబర్ 19 : రూ.500 కోట్ల స్కామ్‌లో కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ పేరు బయటకు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. కర్ణాటకలో ఈ భూ కుంభకోణం వెలుగుచూసింది. బీపీఎల్ ఇండియా లిమిటెడ్‌కు పారిశ్రామిక అవసరాల కోసం కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) కేటాయించిన భూమిలో పరిశ్రమలు స్థాపించకుండా వందల కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ప్రారంభించింది. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్, అతని భార్య అంజు చంద్రశేఖర్, అజిత్ గోపాల్ నంబియార్, బీజేపీ నేత, మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడు పాల్పడిన భూ దందాపై కర్ణాటక ప్రభుత్వం విచారణ చేయాలంటూ ఢిల్లీకి చెందిన న్యాయవాది కేఎన్ జగదీశ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బీపీఎల్ ఇండియాను కూడా తన పిటిషన్లో లక్ష్యంగా చేసుకున్నారు. కాగా, అంజు చంద్రశేఖర్ బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు టీపీజీ నంబియార్ కుమార్తె.
నేలమంగళ, దొబ్బాస్పేట్లో టీవీ, కలర్ ట్యూబ్‌లు, బ్యాటరీలు తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు 175 ఎకరాల వ్యవసాయ భూమిని బీపీఎల్‌కు కేఐఏడీబీ 1995లో కేటాయించింది. ఆ భూమిలో 2004 వరకు ఎలాంటి పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయలేదు. అయితే 1995లోనే కేఐఏడీబీ 149 ఎకరాలకు సంబంధించిన స్వాధీన డాక్యుమెంట్లను బీపీఎల్‌కు ఇచ్చేసింది. 1996 ఏప్రిల్‌లో అజిత్ గోపాల్ నంబియార్, అంజు రాజీవ్ చంద్రశేఖర్‌లు ఆ భూమిని తనఖా పెట్టి రుణాలు పొందారు. తర్వాత అప్పటి బీజేపీ మంత్రి కట్టా సుబ్రహ్యణ్య నాయుడు సహకారంతో ఆ భూమిని అమ్మే హక్కును కూడా పొందారు. అనంతరం దానిని ముక్కలు ముక్కలుగా చేసి పలు సంస్థలకు అమ్మేశారు. 2011లోనే 87 ఎకరాలను 275 కోట్ల రూపాయలకు అమ్మేశారు. ఈ భారీ భూ కుంభకోణంపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని న్యాయవాది కేఎన్ జగదీశ్ కుమార్ కోరారు.