INDIA Bloc : సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నేతలు మంగళవారం ఢిల్లీలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇండియా బ్లాక్ ఆందోళనపై బీజేపీ విరుచుకుపడుతోంది. పలు రాష్ట్రాల్లో మీరు (ఇండియా బ్లాక్ పార్టీలు) కూడా ఈ పద్ధతిలోనే గెలిచాయి కదా అని బీజేపీ ప్రశ్నించింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ సహా ఇండియా బ్లాక్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో ఇండియా బ్లాక్ నిరాశలో ఉందన్నారు. కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌తోపాటు పంజాబ్, ఝార్ఖండ్లలో ప్రతిపక్షాలు ఇదే పద్ధతిలో గెలిచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఓటమి కారణంతో నిరాశతో రాజ్యాంగ వ్యవస్థల్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించాలని సూచించారు. అలా కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. సర్ ప్రక్రియను ఆయన సమర్ధించారు. మరణించిన వారి పేర్లు, పౌరసత్వం లేని వారి పేర్లు, ఒకటికంటే ఎక్కువ పేర్లు ఉన్న ఓట్లు మాత్రమే తొలగిస్తున్నట్లు చౌహాన్ చెప్పారు. ఇదే అంశంపై మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. రాజ్యాంగ వ్యవస్థల్ని నిత్యం అవమానిస్తున్నారని విమర్శించారు. రోజూ కాంగ్రెస్ చేస్తున్న ఈ డ్రామాకు ముగింపు పలకాలని ఆయన హితవు పలికారు. మంగళవారం జరిగిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్ష ఎంపీల ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.