హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘సింగిల్ ఇంజిన్’ సరార్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా దూసుకుపోతుంటే.. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ సొంత రాబడులతో ఆర్థికంగా బలపడుతుంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘డబుల్ ఫెయిల్యూర్’ సరార్లుగా నిలుస్తున్నాయి. కేంద్రంలోని మోదీ విధానాలతో ప్రజల ఆదాయ మార్గాలు తగ్గడం, ఖర్చులు అమాంతం పెరగడంతో రాష్ర్టాలకు రాబడి గణనీయంగా తగ్గుతున్నది. అయితే.. తెలంగాణ అప్పుచేసిన ప్రతి రూపాయిని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తూ మళ్లీ సంపదను సృష్టిస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలు మాత్రం సంపద సృష్టిలో బోల్తా పడుతున్నాయి. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, సంపదను ఎలా సృష్టించుకోవాలో తెలియకపోవడంతో అప్పులు, వాటితోపాటే వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. ఒకవైపు వడ్డీలు అమాంతం పెరుగుతున్నా.. కనీస ఆర్థిక ప్రణాళిక లేకపోవడంతో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతున్నది. ఆర్బీఐ హ్యాండ్‌బుక్-2022 లెక్కల ప్రకారం.. వడ్డీలు చెల్లిస్తున్న జాబితాలో డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో ఉన్న బీజేపీ పాలిత రాష్ర్టాలు అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ తక్కువ వడ్డీల చెల్లింపులతో ఆదర్శంగా నిలుస్తున్నది.
ఉత్తరప్రదేశ్ ఫస్ట్.. తెలంగాణ బెస్ట్
తెలంగాణ సర్కారు పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నది. నిధులు సేకరించేటప్పుడే అన్ని విధాలుగా ఆలోచించి అడుగులేస్తున్నది. అవసరాల మేరకు అప్పులు చేస్తూ.. వడ్డీల చెల్లింపుల కాల పరిమితిలోనూ పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.5,227 కోట్ల వడ్డీ చెల్లింపులు ఉంటే వాటిని 2021-22 ఏడాదికి రూ.17,584 కోట్లకు పరిమితం చేసింది. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే ఇదెంతో ఉత్తమం. ఏటికేడు రుణాలను కట్టడి చేసుకొంటూ, తక్కువగా వడ్డీలు చెల్లిస్తున్నట్టు అర్థమవుతున్నది. దేశంలో అత్యధికంగా వడ్డీలు చెల్లిస్తున్న రాష్ర్టాల్లో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది. దేశంలోని అన్నిరాష్ర్టాలు చెల్లిస్తున్న వడ్డీల్లో 12 శాతం ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే చెల్లిస్తున్నది. తెలంగాణ తన వడ్డీ చెల్లింపులను 4 శాతానికే కట్టడి చేసుకున్నది.
పరిమితికి లోబడే రుణాలు
బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నది. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020-2022 మధ్య మూడేండ్లలో తెలంగాణ సుమారు రూ.86,773 కోట్ల రుణాలు సేకరించింది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బీజేపీ పాలిత రాష్ట్రాలు డబుల్ రుణాలు తీసుకున్నాయి. కర్ణాటక రూ.1.23 లక్షల కోట్ల రుణాలను సేకరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు హర్యానా 35.3 శాతం, ఉత్తరప్రదేశ్ 34.2 శాతం, ఉత్తరాఖండ్ 30.3 శాతం, మధ్యప్రదేశ్ 29 శాతం అప్పులు చేశాయి. తెలంగాణ చేసిన రుణాలు అదుపులోనే ఉన్నాయని కేంద్ర గణాంకాలను బట్టి తెలుస్తున్నది. జీఎస్డీపీతో పోల్చితే తెలంగాణ సేకరించిన రుణాల మొత్తం 27.4 శాతంగా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సేకరించిన రుణాలు 60 శాతాన్ని మించాయి. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం తెలంగాణ పరిమితికి మించి అప్పులు చేస్తున్నదని అసత్యాలు ప్రచారం చేస్తున్నది. డబుల్ ఇంజిన్ సర్కారు అప్పులతో పోలిస్తే.. తెలంగాణ పరిమితికి మించే రుణాలు సేకరిస్తున్నదని ఆర్బీఐ నివేదికతో తేటతెల్లమైంది.