కోల్కతా, మార్చి 11: ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై 2024లో బీజేపీని ఓడించాలని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఇంకా ఆలోచిస్తే, కాంగ్రెస్ కోసం చూస్తే లాభం లేదన్నారు. ‘కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతున్నది. గెలుస్తామన్న ఆశ కూడా వాళ్లకు లేదు. ఆ పార్టీ విశ్వసనీయతను కోల్పోయింది. దాని కోసం చూడటంలో అర్థం లేదు’ అని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ కోరుకుంటే కలసి పనిచేసేందుకు సిద్ధమేనన్నారు. శుక్రవారం బెంగాల్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం మమత విలేకరులతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం, ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్లనే బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ నాలుగు రాష్ర్టాల్లో గెలవడంపై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పును ప్రతిబింబించడం లేదని మమత పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో 2024లో ప్రజల తీర్పు ఏంటో స్పష్టమైందనీ, కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మమత ఖండించారు. మోదీ పగటి కలలు కనడం మానుకోవాలన్నారు. 2022లోనే మోదీ 2024కు వెళ్లారని ఎద్దేవా చేశారు. మోదీ హంగామా చూస్తే 2024లో మునిగిపోతారనిపిస్తుందని పేర్కొన్నారు.