అంబాలా: యూపీలోని లఖింపూర్ ఖీరీలో చోటుచేసుకున్న దారుణ ఘటన ప్రకంపనలు సృష్టిస్తుండగా అలాంటిదే హర్యానాలోనూ జరిగింది. బీజేపీ ఎంపీ నాయబ్ సైనీ కాన్వాయ్‌లోని వాహనం కేంద్ర వ్యవసాయ చట్టాలపై నిరసన తెలియజేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. అంబాలా సమీపంలోని నారాయణ్‌గఢ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ రైతు గాయపడ్డాడు. రైతుల మీద నుంచి దూసుకెళ్లిన వాహనంలోనే ఎంపీ నాయబ్ ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నాయబ్ కురుక్షేత్ర నియోజకవర్గ ఎంపీ. రాష్ట్ర మంత్రి మూల్‌చంద్ శర్మతో పాటు పలువురు నాయకులతో కలిసి నారాయణ్‌గఢ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. నాయబ్‌కు తమ నిరసన తెలిపేందుకు రైతులు తరలివచ్చారు. నాయబ్ తిరిగి వెళుతుండగా ఆయన కాన్వాయ్‌లోని వాహనం రైతులను ఢీకొట్టింది. దాని డ్రైవర్‌పై కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.