Kangana Ranaut | న్యూఢిల్లీ, ఆగస్టు 26: రైతాంగ ఉద్యమంపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోయి ఉంటే, కేంద్ర నాయకత్వం బలంగా లేకుంటే భారత్‌లో కూడా బంగ్లాదేశ్ పరిస్థితులు తలెత్తేవని వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకొన్నప్పటికీ స్వార్థ ప్రయోజనాలు ఆశించేవారు, విదేశీ శక్తులు రైతాంగ ఉద్యమాన్ని ఎగదోస్తున్నాయని ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, మహిళలపై లైంగిక దాడులు చోటుచేసుకొన్నాయని ఆరోపిస్తూ తన ఎక్స్ ఖాతాలో వీడియోను పోస్టు చేశారు. ‘బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో, మన దేశంలో కూడా జరిగే అవకాశం ఉన్నది. విదేశీ శక్తులు, స్వార్థ శక్తులు ఇందుకు కుట్ర పన్నాయి. దేశం కుక్కల పాలైనా వారికేం పట్టదు’ అని అన్నారు.
రైతుల ప్రభావం అధికంగా ఉండే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు అధికార బీజేపీకి తలనొప్పిగా మారాయి. కంగన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కమలం పార్టీ వెంటనే స్పందించింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కంగన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని, ఆమె వ్యాఖ్యలను అంగీకరించడం లేదని బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ పాలసీ అంశాలపై మాట్లాడేందుకు అధికారం కానీ, అనుమతి గానీ ఆమెకు లేదని పేర్కొన్నది. వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కంగనాకు పంజాబ్ బీజేపీ సీనియర్ నేత హర్జిత్ గరేవాల్ సూచించారు. రైతుల గురించి మాట్లాడే పని ఆమెది కానని, కంగన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతంగా పరిగణించాలని, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలు రైతు పక్షపాతులు అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, కంగన వ్యాఖ్యలు కూడా అదేవిధంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు.
రైతాంగ ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలను ఏఐకేఎస్ ఖండించింది. దేశ వ్యవసాయ రంగాన్ని మింగేయాలనుకొంటున్న బయటి, అంతర్గత బాస్‌లను సంతోష పెట్టేందుకే ఆమె ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే ఓ ప్రకటనలో విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని మోసం చేసిన, బ్రిటీషర్లకు తొత్తులుగా వ్యవహరించిన మతతత్వ శక్తులకు దేశ రైతాంగం, కార్మికుల దేశభక్తిని ప్రశ్నించే నైతికత లేదని అన్నారు. కంగన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతాంగ ఉద్యమం, రైతుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కంగనకు ఇదే తొలిసారి కాదు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. 2020లో ఉద్యమంలో పాల్గొన్న ఓ మహిళా రైతును ‘బిల్కిస్ బానో’గా పేర్కొన్న ఆమె.. డబ్బులిచ్చి ఆందోళనలకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఇటీవల మండీ ఎంపీగా ఎన్నికైన తర్వాత కంగనకు చండీగఢ్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ఆమె చెంపపై చెళ్లుమనిపించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.