MP K Sudhakar | న్యూఢిల్లీ, జూలై 8: లోక్సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ ఎంపీగా బీజేపీ నేత కే సుధాకర్ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా ఆయన అభిమానులు సోమవారం పెద్దయెత్తున ‘మందు పార్టీ’ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వందలాది మందికి మద్యం సీసాలు, ఆహారాన్ని సరఫరా చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘ఇదీ బీజేపీ సంస్కృతి’ అని వ్యాఖ్యానించారు.
దీనిని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి కోసం పోలీసులకు స్వయంగా లేఖ రాసిన ఎంపీ సుధాకర్ ఆ తర్వాత ఈ కార్యక్రమం గురించి తనకు తెలియదని ప్రకటించారు. పోలీసులు సైతం ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చి, పెద్దయెత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది.