న్యూఢిల్లీ, అక్టోబర్ 17: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులపై బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ బుకాయింపు వ్యాఖ్యలు చేశారు. తాను లైంగిక ఉద్దేశంతో మహిళా రెజ్లర్ల చేయి పట్టుకోలేదని, కేవలం పల్స్ చెక్ చేశానని సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. ‘సందర్భం లేకుండా నేను వారి శ్వాసక్రియను ఎందుకు చెక్ చేస్తాను. నేను వారిని లైంగికంగా వేధించాలనుకొని ఉంటే వారి కడుపును తాకి శ్వాసక్రియను పరిశీలించేవాడిని’ అని చెప్పుకొచ్చారు.
ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బ్రిజ్‌భూషణ్ కేవలం పల్స్ రేట్ చెక్ చేశారని తెలిపారు. ఓవర్‌సైట్ కమిటీ ఏర్పాటుకు ముందు బ్రిజ్‌భూషణ్‌పై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. కేవలం ట్వీట్ల ఆధారంగా కమిటీ విచారణ చేసిందన్నారు. తదుపరి విచారణను 19కి కోర్టు వాయిదా వేసింది.