DK Shivakumar | బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్ ఆరోపణల్లో చిక్కుకున్న వేళ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో బీజేపీ ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ మంగళవారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మైసూర్లో సిద్ధరామయ్య భార్యకు అక్రమంగా భూములు కేటాయించారన్న ఆరోపణల అంశం గతకొద్ది కాలంగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. వాల్మీకి స్కామ్, పలు ఇతర అంశాలతో పాటు ఈ వ్యవహారం సీఎం సిద్ధరామయ్య కుర్చీకి ఎసరు పెట్టే అవకాశం ఉందని, ఇదే జరిగితే ఈసారి ఎలాగైనా సీఎం పీఠం దక్కించుకొనేందుకు డీకే శివకుమార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ కూడా నడుస్తున్నది. ఇలాంటి సమయంలో ముడా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా విమర్శించడంతోపాటు ముడా స్కామ్‌పై ఇటీవల మీడియాతో మాట్లాడిన విశ్వనాథ్ డీకేతో భేటీ కావడం వెనుక ఉద్దేశాలు, రాజకీయ ఎత్తుగడలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
సిద్ధరామయ్యపై ఎమ్మెల్సీ విశ్వనాథ్‌కు తీవ్ర అసంతృప్తి ఉన్నది. విశ్వనాథ్ కూడా కురుబ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. గతంలో కాంగ్రెస్ నుంచి మైసూర్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. ఇందుకు ఆయన సిద్ధరామయ్యతో పలుమార్లు భేటీ అయినా టికెట్ దక్కలేదు. ఇదే విశ్వనాథ్ ముడా స్కామ్ అంశాన్ని బయటపెట్టేందుకు దారితీసిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు డీకేతో భేటీ కావడం వెనుక ఉద్దేశాలు, తిరిగి కాంగ్రెస్‌లోకి అతని రాకకు సంబంధించి చర్చ ప్రారంభమైంది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బెంగళూరు రూరల్ నుంచి డీకే సోదరుడు, బెంగళూరు నార్త్, మైసూర్ స్థానాల్లో పోటీచేసిన వొక్కళిక కమ్యూనిటీ అభ్యర్థులు ఓటమి పాలవడంతో డిప్యూటీ సీఎంకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. దీంతో కేఎన్ రాజన్న వంటి సిద్ధరామయ్య సన్నిహితులు మరికొంత మందికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలనే డిమాండ్‌ను తీసుకురావడం డీకే వర్గానికి ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమయంలో ముడా స్కామ్ అంశాన్ని విశ్వనాథ్ లేవనెత్తడం డీకేకు ఊరటనిచ్చినట్టు అయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
శివకుమార్‌తో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, గ్రాంట్లు, అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించేందుకు వచ్చానని విశ్వనాథ్ చెబుతున్నారు. తన మీటింగ్‌లకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాతో పంచుకొనే డీకే.. మంగళవారం విశ్వనాథ్‌తో జరిగిన భేటీ ఫొటోలను షేర్ చేయలేదు. ఈ భేటీలో డీకే, విశ్వనాథ్‌లకు సన్నిహితుడైన మైసూర్ జిల్లా మాజీ ఇన్చార్జి మంత్రి ఎస్టీ సోమశేఖర్ ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఆయన వద్ద ముడా భూ కేటాయింపులకు సంబంధించి ఒరిజనల్ పత్రాలు ఉన్నాయనే ప్రచారం ఉన్నది.