Delhi Assembly | ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు వాడీవేడీగా సభ సాగింది. సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. సభ్యుల ఆందోలన మధ్య సభకు రెండుసార్లు అంతరాయం కలిగింది. చివరకు సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యేలు మాస్కులు ధరించి ఆక్సిజన్ సిలిండర్లతో అసెంబ్లీకి వచ్చారు. విషపూరిత గాలికి ప్రజలు చనిపోతున్నా సీఎం కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. కాగా, శీతాకాల సమావేశాలు మూడు రోజులే జరుగనున్నాయి. ఈ సెషన్లో ప్రశ్నోత్తరాలను తొలగించారు.
శిక్షణ కోసం ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపకపోవడంపై ఆప్ ఎమ్మెల్యేలు ఎల్జీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. యోగా తరగతులను రద్దు చేశారని, ఉపాధ్యాయులను శిక్షణకు ఫిన్లాండ్ పంపడంలో తాత్సారం చేశారని సీఎం కేజ్రీవాల్ ఎల్జీ సక్సేనాపై ఆరోపణలు చేశారు. అలాగే, మొహల్లా క్లినక్లతో తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో వాటిని నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎల్జీ రాజ్యాంగాన్ని ఏమాత్రం ఫాలో కావడం లేదని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎల్జీ కొట్టిపారేశారు. ఆప్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు.
ఆప్-బీజేపీ మధ్య ఆరోపణలు – ప్రత్యారోపణల మధ్య సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. తిరిగి 11 గంటలకు సమావేశం కాగానే, ఎల్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆప్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చారు. దాంతో సభ మరోసారి 10 నిమిషాలపాటు వాయిదా పడింది. తిరిగి సభ మొదలవగానే బీజేపీ సభ్యులు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో వెల్లోకి దూసుకొచ్చారు. దాంతో సభను రేపటికి వాయిదా వేశారు. కాగా, బిజినెస్ లిస్ట్ ప్రకారం, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ 7వ వార్షిక నివేదికను, ఇంద్రప్రస్థ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ 19వ వార్షిక నివేదికను సమర్పించారు. ప్రగతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 19వ వార్షిక నివేదిక, ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్ వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. దీంతో పాటు, ఢిల్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సవరణ) బిల్లు, 2023 ను కూడా ప్రవేశపెట్టనున్నారు.