బెంగళూర్ : కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ రగడపై ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ రేణుకాచార్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రియాంక గాంధీ బికినీ ట్వీట్ దిగజారుడు ప్రకటనగా ఆయన అభివర్ణిస్తూ కాలేజ్‌లో చదివే పిల్లలు తమ శరీరాన్ని పూర్తిగా కప్పేలా బట్టలు ధరించాలని చెబుతూ మహిళల దుస్తుల కారణంగానే ఇవాళ లైంగిక దాడుల ఘటనలు పెరుగుతున్నాయని, మహిళల దుస్తులు పురుషులను రెచ్చగొట్టేలా ఉంటున్నాయని అన్నారు. మహిళలు నిండుగా బట్టలు ధరించాలని, మన దేశంలో మగువలకు గౌరవం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కర్నాటకలో హిజాబ్ వివాదంపై బుధవారం ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.క్లాస్‌రూంల్లో హిజాబ్ ధరించడంపై కర్నాటకలో నిషేధం విధించగా విద్యార్ధినులకు మద్దతుగా ప్రియాంక ట్వీట్ చేశారు.
ఎలాంటి దుస్తులు ధరించాలన్నది విద్యార్ధినుల ఎంపికని, రాజ్యాంగం వారికి ఆ హక్కును ప్రసాదించిందని ఆమె పేర్కొన్నారు. బికినీ లేదా, జీన్స్ లేదా హిజాబ్..ఇలా ఏం ధరించాలనేదని మహిళల ఇష్టమని, ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ట్వీట్‌కు మద్దతుగా రాహుల్ గాంధీ థంబ్సప్ ఎమోజీతో స్పందించారు. ఇక ముస్లిం యువతులు ఎప్పటినుంచో హిజబ్ ధరిస్తున్నారని ఇప్పుడు దీనిపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ముస్లిం యువతులను హిజబ్ ఆధారంగా వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఇది పూర్తిగా వివక్షతో కూడుకున్నదని మండిపడ్డారు.
ఏ ఒక్కరి రాజ్యాంగ హక్కును నిరాకరించడం సరైంది కాదని అన్నారు. ముస్లిం యువతులను హిజబ్ ధరించకుండా మీరు ఎలా వేరుచేస్తారని ఆయన ప్రశ్నించారు. బేటీ బచావో..బేటీ పఢావో అని బీజేపీ నినదిస్తుండగా అసలు హిజబ్ వ్యవహారంలో మహిళా సాధికారత ఎక్కడ ఉందని ఓవైసీ ఓ వార్తాచానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.విద్వేష రాజకీయాలకు ఈ ఉదంతం విస్పష్ట ఉదాహరణని, ఇలాంటి శక్తులను బీజేపీ ప్రేరేపిస్తోందని ఆరోపించారు. మరోవైపు హిజబ్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీపీఎం ఎంపీ ఎలమరం కరీం లేఖ రాశారు. చాలా ఏండ్లుగా విద్యార్ధినులు యూనిఫాంతో పాటు హిజబ్ ధరిస్తున్నారని..కొన్ని విద్యాసంస్ధలు హిజబ్ రంగును కూడా సూచిస్తున్నాయని ప్రస్తావించారు. ఈ అంశాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలు రెచ్చగొడుతూ విభజన బీజాలు నాటేలా పక్కదారిపట్టిస్తున్నారని లేఖలో ఎంపీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.