ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్(Rahul Narwekar) ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఆయన ఆ పదవికి ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఆయన ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలు అజిత్ పవార్, ఏకనాథ్ షిండే, ఇతర బీజేపీ నేతలు ఆయనకు సపోర్టు ఇచ్చారు. స్పీకర్ పోస్టు కోసం మహా వికాశ్ అగాధీ కూటమి నామినేషన్ దరఖాస్తు చేయలేదు.
ప్రతిపక్ష నేత ఎన్నిక అంశంలో స్పీకర్ నర్వేకర్ పాత్రపై అందరి దృష్టి ఉన్నది. అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి 10 శాతం కన్నా తక్కువ సీట్లు ఉన్నాయి. దీంతో ప్రతిపక్ష నేత హోదాను ఇస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూలై 2022లో తొలిసారి నర్వేకర్ స్పీకర్గా నియమితుడయ్యారు. శివసేన ఎమ్మెల్యేలు అనర్హత పిటీషన్లు దాఖలు చేసిన సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
తాజాగా ముగిసిన మహా అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి 288 సీట్లలో 230 సీట్లు దక్కాయి. మహా వికాశ్ అగాధికి 46 సీట్లు వచ్చాయి.