భువనేశ్వర్, జూన్ 11: ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకొన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ అధిష్ఠానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎంలుగా కనక్ వర్ధన్ సింగ్ దియో, ప్రవటి పరిదా ఉంటారని రాజ్‌నాథ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. మాఝీని శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారని తెలిపారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో బుధవారం జరుగనున్నది. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, పలువురు బీజేపీ సీనియర్ నేతలు హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర కొత్త సీఎంగా సురేశ్ పుజారి, బైజయంత్ పాండా, అపరాజిత సారంగి, గిరీష్ ముర్ము తదితరుల పేర్లు ప్రచారంలోకి రాగా.. బీజేపీ అనూహ్యంగా మోహన్ చరణ్ మాఝీని ఎంపిక చేసింది.
రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బీజేడీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 147 స్థానాలు ఉన్న అసెంబ్లీలో బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించగా, బీజేడీ 51 స్థానాలకు పరిమితమైంది. దీంతో 24 ఏండ్ల నవీన్ పట్నాయక్ పాలనకు ముగింపు కార్డు పడింది. సీఎంగా తనను ఎన్నుకోవడంపై మాఝీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు కృషి చేస్తానని, రాష్ర్టాభివృద్ధికి పనిచేస్తానని చెప్పారు.
కియోంఝర్ జిల్లా రైకల గ్రామానికి చెందిన 52 ఏండ్ల మోహన్ చరణ్ మాఝీ ఒక వాచ్మెన్ కుమారుడు. 1997-2000 మధ్య గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితం మొదలు పెట్టారు. మోహన్ మాఝీ అసెంబ్లీకి ఎన్నికవడం ఇది నాలుగోసారి. 2000లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2019లోనూ శాసనసభ్యుడిగా గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కియోంఝర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేడీ అభ్యర్థిపై 11 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కెరీర్ ప్రారంభంలో ఆయన ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో సంబంధాలు ఉన్న మోహన్ మాఝీ రాష్ట్రంలో ఒక బలమైన గిరిజన నేతగా ఎదిగారు. 2019-24 మధ్య అసెంబ్లీలో బీజేపీ చీఫ్ విప్‌గా పనిచేశారు.
రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపడుతున్న బీజేపీకి సీఎం అధికార భవనం రూపంలో మొదటి సమస్య వచ్చి పడింది. 2000 నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల వరకు రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లోని తన సొంత ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం అధికారిక నివాసం కోసం బీజేపీ, అధికార యంత్రాంగం అన్వేషణ కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే కొత్త సీఎం తాత్కాలిక నివాసంగా స్టేట్ గెస్ట్ హౌస్, పలు ఇతర భవనాలను పరిశీలిస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.