ఘజియాబాద్, మార్చి 21 : గతంలో ఎన్నడూ లేనంత అవినీతి ప్రభుత్వం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉందని లోనీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిశోర్ గుర్జర్ శుక్రవారం సొంత ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అధికారులు తప్పుదారి పట్టిస్తూ రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారని ఆయన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. చిరిగిపోయిన కుర్తా ధరించి విలేకరుల సమావేశంలో పాల్గొన్న గుర్జర్ తన బట్టలను పోలీసులు చింపివేశారని ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శని, అయోధ్యలో అధికారులు లూటీ చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో గోవధ భారీ స్థాయిలో జరుగుతోందని, బూటకపు ఎన్కౌంటర్లలో ప్రజలు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.