బెంగళూర్ : తనను ప్రశ్నించిన మహిళ పట్ల బీజేపీ ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. మహిళపై కేకలు వేయడమే కాకుండా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకునేలా వ్యవహరిస్తూ కెమెరాకు చిక్కారు. బెంగళూర్ నగరంలో ఎమ్మెల్యే పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది.
తమ ప్రాంతానికి వచ్చిన మహదేవపుర ఎమ్మెల్యే అరవింద్ లింబావలిని కలిసేందుకు వచ్చిన మహిళ ఆయనకు సమస్యలను తెలిపేందుకు ప్రయత్నించగా ఆగ్రహంతో ఆయన కేకలు వేశారు. తన చేతిలో ఉన్న పేపర్‌ను చూపేందుకు మహిళ ప్రయత్నించగా ఆ పేపర్‌ను ఎమ్మెల్యే చించేశాడు.
ఆపై ఆమెను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించాడు. ఈ వీడియో వీవీఐపీల దురుసు ప్రవర్తన, అధికార దుర్వినియోగాన్ని ఎత్తిచూపుతోంది. కాగా ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తూ పట్టుబడిన తన కుమార్తె పోలీసులతో దుందుడుకుగా వ్యవహరిస్తూ పట్టుబడటంపై ఎమ్మెల్యే క్షమాపణ కోరిన మూడు నెలల అనంతరం తాజా ఘటన చోటుచేసుకుంది.