సంభాల్: ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతాపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కొవిడ్ నిబంధలను తూచా తప్పకుండా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లాలోని అస్మోలీ నియోజకవర్గ ఎమ్మెల్యే హరేంద్ర సింగ్ రింకూ.. గురువారం తన నియోజకవర్గంలోని చౌపాలీ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఏ ఒక్కరూ సామాజిక దూరం పాటించలేదు. పైగా చాలామంది మాస్కులు ధరించలేదు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
బీజేపీ ఎమ్మెల్యే హరేంద్రసింగ్ రింకూపై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు సమావేశానికి హాజరై కొవిడ్ నిబంధనలు పాటించని మరో 60 మందిపై కూడా కేసులు బుక్ చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.