పనాజీ: బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పర్యాటకులు తగ్గడానికి
‘ఇడ్లీ-సాంబార్’ (Idli-sambar) కారణమని అన్నారు. ఇతర రాష్ట్రాల వారు సముద్ర బీచ్‌ల వద్ద వ్యాపారాలు చేసుకుని ‘ఇడ్లీ-సాంబార్’ అమ్ముతున్నారని విమర్శించారు. గోవాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విదేశీ టూరిస్ట్‌ల సందర్శన తగ్గడానికి ప్రభుత్వాన్ని మాత్రమే నిందించలేమని తెలిపారు. ఇతరులకు కూడా సమాన బాధ్యత ఉంటుందని అన్నారు.
కాగా, గోవా వాసులు బీచ్ ప్రాంతాలను ఇతర రాష్ట్రాల వ్యాపారవేత్తలకు అద్దెకు ఇచ్చారని మైఖేల్ లోబో తెలిపారు. ‘బెంగళూరుకు చెందిన కొందరు ‘వడ పావ్’ వడ్డిస్తున్నారు. మరికొందరు ఇడ్లీ-సాంబార్ అమ్ముతున్నారు. (అందుకే) గత రెండేళ్లుగా రాష్ట్రంలో అంతర్జాతీయ పర్యాటకం క్షీణిస్తోంది’ అని ఆయన అన్నారు.
మరోవైపు దక్షిణ రాష్ట్రాల అల్పాహారాలు గోవాలో పర్యాటక రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అన్నది బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో వివరించలేదు. అయితే పర్యాటకుల సంఖ్య తగ్గడం వల్ల తమ రాష్ట్రంలో ఒక రకమైన గందరగోళం నెలకొన్నదని తెలిపారు. ‘ఉత్తరాది అయినా, దక్షిణాది అయినా, తీరప్రాంతంలో విదేశీ సందర్శకుల రాక గణనీయంగా తగ్గింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి’ అని అన్నారు.
కాగా, ప్రతి ఏటా కొందరు విదేశీయులు గోవాను సందర్శిస్తారని మైఖేల్ లోబో తెలిపారు. అయితే యువ విదేశీయులు గోవాకు రావడం లేదన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల రష్యా టూరిస్టులు గోవాను సందర్శించడం లేదని చెప్పారు. పర్యాటక శాఖ, ఇతర వాటాదారులు సంయుక్త సమావేశం నిర్వహించి కారణాలను అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే క్యాబ్ ఆపరేటర్లు, స్థానిక టూరిస్ట్ ట్యాక్సీ ఆపరేటర్ల మధ్య విభేదాలు వంటి కీలకమైన సమస్యలను పరిష్కరించాలని అన్నారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో పర్యాటక రంగంలో మరింత చీకటిని చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.