అహ్మదాబాద్ : గుజరాత్ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆశాపటేల్ (44) ఆదివారం మృతి చెంది. ఇటీవల డెంగ్యూ బారినపడ్డ ఆమె అహ్మదాబాద్‌లో జయదల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని మాజీ సీఎం నితిన్ పటేల్ తెలిపారు. ఆశా పటేల్ ఇకపై మన మధ్య లేరని తెలుపడానికి చాలా బాధ కలిగిస్తోందన్నారు.
డెంగ్యూ బారినపడి ఆసుప్రతిలో చికిత్స పొందుతుండగా.. వైద్యులు ఎంత శ్రమించినా కాపాడలేకపోయారన్నారు. ఈ సందర్భంగా ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. సోమవారం సిధ్పూర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సంతాపం తెలిపారు. 2017లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, 2019 ఫిబ్రవరిలో ఆమె బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.