న్యూఢిల్లీ : హత్యాచార కేసులో దోషిగా తేలి పెరోల్‌పై ఉన్న రాం రహీం సింగ్ (డేరా బాబా)ను సత్సంగ్‌లో హిమాచల్ ప్రదేశ్ రవాణా శాఖ మంత్రి విక్రమ్ ఠాగూర్ కలవడం కలకలం రేపింది. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డేరా బాబా ముందు మంత్రి మోకరిల్లి ఆశీస్సులు తీసుకోవడం వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో తాను మంత్రి, ఎమ్మెల్యేనని మీ ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని చెబుతుండటం కనిపిచింది.
పంజాబ్, హర్యానాల్లో మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారని, హిమాచల్ ప్రజలు మీ సత్సంగాలకు హాజరవడం కొనసాగించాలని తాను కోరుకుంటున్నానని మంత్రి అన్నారు. మీ ఆశీస్సులు మాకు లభిస్తాయని ఆశిస్తున్నామని బీజేపీ మంత్రి చెబుతుండటం కనిపించింది. రాం రహీం సింగ్‌కు ఎన్నికల ముందు పెరోల్ ఇవ్వడం పట్ల విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
హత్యాచార కేసుల్లో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు మనోహర్‌లాల్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం అక్టోబర్ 14న 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. నవంబర్ 3న హర్యానాలో ఆదంపూర్ ఉప ఎన్నిక జరగనుండగా త్వరలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రాం రహీం సింగ్‌కు పంజాబ్, హర్యానాల్లో పెద్దసంఖ్యలో అనుచర గణం ఉండటంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ సర్కార్ ఆయనకు పెరోల్ మంజూరు చేసిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.