పూరూలియా (పశ్చిమబెంగాల్), మే 31: మరో రెండేండ్లలో (2024) జరుగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ‘విద్వేష, హింసాయుత రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీని ఇంటికి పంపించాలి. దేశంలో ఆ పార్టీకి పుట్టగతులుండకుండా చేయాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవు. కాబట్టి మనం కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలి’ అని మమత సూచించారు. మోదీ సర్కార్ అసమర్థ, అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నదని విమర్శించారు. కేంద్రం తప్పులను ఎత్తి చూపితే సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతున్నదని ఆరోపించారు. చేతకాని హామీలను ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 8 ఏండ్లు పాలించినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. ఇంతటి అసమర్థ ప్రభుత్వం దేశానికి అవసరం లేదని తెలిపారు.