బెంగళూరు, అక్టోబర్ 7: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటన పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కాగా మాజీ ఐపీఎస్ అయిన ఓ బీజేపీ నాయకుడు మాత్రం న్యాయవాది రాకేష్ కిశోర్ చర్యను పొగడ్తలతో ముంచెత్తారు. సీజేఐపై చెప్పు విసరాలని నిర్ణయం తీసుకుని, దానికి కట్టుబడి ఉన్నందుకు ఆ న్యాయవాది ధైర్యాన్ని తాను ఆరాధిస్తున్నానని కర్ణాటక బీజేపీ నాయకుడు, బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావు మంగళవారం వ్యాఖ్యానించారు. చట్టపరంగా అది తప్పయినా మీ వయసులో ఒక వైఖరిని తీసుకుని పర్యవసానాలకు వెరవకుండా దానికి కట్టుబడి ఉన్న మీ ధైర్యాన్ని తాను ఆరాధిస్తున్నట్లు భాస్కర్‌రావు తెలిపారు.
సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిశోర్‌ని సస్పెండ్ చేస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ప్రకటించింది. బీసీఐ తీసుకున్న చర్యపై ఎక్స్ వేదికగా స్పందించిన రాకేష్ కిశోర్ తన చర్యకు చింతించడం లేదని స్పష్టం చేశారు. ఈ పోస్టుకు స్పందిస్తూ భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. భాస్కర్ రావు వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకుడు మన్సూర్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా తప్పయినప్పటికీ ఆయన ధైర్యాన్ని తాను ఆరాధిస్తానని ఓ మాజీ ఐపీఎస్ అధికారి చెప్పడం సిగ్గుచేటని మన్సూర్ ఖాన్ విమర్శించారు. ఒకప్పుడు చట్టాన్ని రక్షించిన వ్యక్తి ఇప్పుడు సీజేఐని అవమానించిన న్యాయవాదికి మద్దతు ఇవ్వడాన్ని నైతిక పతనంగా ఆయన అభివర్ణించారు.