న్యూఢిల్లీ, జూలై 19: యువత నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చినా కూడా కొనసాగిస్తున్న అగ్నిపథ్ పథకం ద్వారా జరుగుతున్న ఆర్మీ నియామకాలు కులం, మతం ప్రాతిపదికన జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీతో సహా విపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, జేడీ(యూ) నేత ఉపేంద్ర కుష్వాహా, ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కుల ధ్రువీకరణ పత్రాలు కావాలని ఉన్న డాక్యుమెంట్‌ను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. కులం గురించి అడగాల్సిన అవసరం ఏముందని దుయ్యబట్టారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కులతత్వ ప్రభుత్వం ఉన్నదని తేజస్వీ యాదవ్ విమర్శలు చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆర్మీ నియామకాల్లో కులం గురించి అడుగుతున్నారని, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు దేశానికి సేవ చేయడానికి అర్హులు కాదా? అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలని ఆప్ నేత సంజయ్ సింగ్ సవాల్ విసిరారు. బీజేపీ మిత్రపక్షమైన జేడీ(యూ) నేత కుష్వాహా మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం చవక ముఖాన్ని ప్రజల ముందుంచింది. దేశానికి అగ్నివీరులను అందిస్తారా? లేక జాతి వీరులనా? రిజర్వేషన్లు లేనప్పుడు కులం గురించి ఎందుకు అడుగుతున్నారు?’ అని ప్రశ్నించారు.
అవన్నీ పుకార్లే: కేంద్రం
దీన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశ యువత మళ్లీ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయించాలనే దురుద్దేశంతో ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారని పార్లమెంటు ఆవరణలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నియామక ప్రక్రియ స్వాతంత్య్రం రాకముందు నుంచీ ఉందని, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ‘2013లో కాంగ్రెస్ హయాంలో సుప్రీం కోర్టులో దాఖలైన పిల్‌కు ఆర్మీ సమాధానం ఇచ్చింది. నియామకంలో కులం లేదా మతంతో సంబంధం లేదని, పరిపాలనా సంబంధ కారణాలతోనే ధ్రువీకరణ పత్రం అడుగుతున్నామని ఆర్మీ తెలిపింది’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పష్టం చేశారు. మరోవైపు అగ్నిపథ్‌ను చాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపడుతామని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది.