న్యూఢిల్లీ, అక్టోబర్ 31: టోల్ ఫీజు కట్టమన్నందుకు టోల్‌ప్లాజా సిబ్బందిపై బీజేపీ నేత కుమారుడొకరు దౌర్జన్యం చేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ఉదంతమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజుగౌడ పాటిల్ కుమారుడు సమర్తగౌడ పాటిల్ విజపుర నుంచి సిందగీవైపు వెళ్తూ దారిలో ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఆగాడు.
టోల్ ఫీజు కట్టమని సిబ్బంది అడగగా, తాను విజుగౌడ పాటిల్ కుమారుడినని, నన్నే టోల్ ఫీజు కట్టమంటారా? అంటూ వారితో గొడవకు దిగాడు. విజుగౌడ ఎవరని ప్రశ్నించిన సిబ్బందిని సమర్తగౌడ, అతని అనుచరులు దూషిస్తూ చితకబాదారు. ఈ దాడిలో సంగప్ప అనే ఉద్యోగి గాయపడ్డాడు.