బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ నేతలు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. తాజాగా ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహోళి చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ. శుక్రవారం బెళగావి రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బహిరంగంగా ఓట్ల కొనుగోలుకు తెరలేపారు.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి లక్ష్మి హెబ్బాల్కర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ‘మా ప్రత్యర్థి రూ.70 టిఫిన్ బాక్స్, రూ.700 ప్రెషర్ కుక్కర్ ఇస్తున్నారు. ఇవన్నీ కలిపినా రూ.3,000 కూడా కావు. మేము ఇప్పుడు గిఫ్టులు ఏమీ ఇవ్వడం లేదు. కానీ ఆమె కంటే రెండింతలు ఎక్కువ ఇస్తాం. రూ.6,000 కనుక మేము మీకు పంపించకపోతే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయకండి’ అంటూ రమేశ్ జార్ఖిహోళి ప్రకటించారు.