బెంగళూరు: మైనింగ్ దిగ్గజంగా పేరొందిన కర్ణాటక ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కొప్పల్‌లో మైనింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపినట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని కొప్పల్ పట్టణంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా ఒక నిరసన ప్రదర్శనకు గాలి జనార్దన్ రెడ్డి నాయకత్వం వహించినట్టు ఓ పత్రికా విలేకరి ఎక్స్‌లో వెల్లడించారు. గాలి జనార్దన్ రెడ్డితోపాటు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిత్మల్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారని ఆ విలేకరి ఫొటోలతో సహా షేర్ చేశారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కోట్లాది రూపాయల మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. బళ్లారిలో భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ జరిగినట్లు కర్ణాటక లోకాయుక్త నిర్ధారించడంతో 2011లో జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. విచారణను ముగించాలని ప్రత్యేక సీబీఐ కోర్టును సుప్రీంకోర్టు 2022 అక్టోబర్ 10న ఆదేశించినా 13 ఏండ్లకు పైగా ఈ కేసు ముందుకు సాగడం లేదు.