కోల్కతా : హోలీ వేడుకల సందర్భంగా పార్టీ కార్యకర్తపై తాను చేయిచేసుకోలేదని బీజేపీ నేత బాబుల్ సుప్రియో వివరణ ఇచ్చారు. కాషాయ పార్టీ నేత కార్యకర్తను చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కినా బాబుల్ సుప్రియో తన చర్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ‘ఆదివారం అసలేం జరగలేదు..ఇవన్నీ తప్పుడు ఆరోపణలేన’ని ఆయన చెప్పుకొచ్చారు.
‘పార్టీ కార్యకర్తలకు నేను పెద్దన్న లాంటి వాడిని..నిన్న చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకోగా..నేను పెద్దన్న లాగా కార్యకర్తపై చేయిపైకెత్తి చిన్నగా కొట్టానని..దీన్ని చెంపదెబ్బలా ప్రచారం చేశార’ని బాబుల్ సుప్రియో వివరణ ఇచ్చారు. అసన్సోల్ బీజేపీ ఎంపీ అయిన సుప్రియో ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టోలీగంజ్ నుంచి బరిలో ఉన్నారు. బెంగాల్లో ఇటీవల ఐదుగురు బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని, ఈ దమనకాండపై దర్యాప్తు ఇంతవరకూ కొలిక్కిరాలేదని బీజేపీ నేత ఆరోపించారు.