భోపాల్: కల్తీ మద్యం తాగిన వారిలో బీజేపీ నేతతో సహా 12 మంది మరణించారు. మరో 54 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కల్తీ మద్యం సేవించి మరణించిన వారి మృతదేహాలలో అధిక స్థాయిలో మిథనాల్ ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికల ద్వారా వెల్లడైంది. (spurious liquor) మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లాలోని బుండా-షాఘర్ ప్రాంతంతో పాటు ఘూఘర్, నౌరాజ్, బరాజ్, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు శనివారం రాత్రి మద్యం సేవించారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా చాలా మంది మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మరికొందరిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.
కాగా, కల్తీ మద్యం తాగిన వారిలో బీజేపీ మండల్ ప్రధాన కార్యదర్శి హర్నామ్ రాయ్‌తో సహా 12 మంది మరణించారు. మరో 54 మంది చికిత్స పొందుతున్నారు. మరణించిన వారి మృతదేహాలలో అధిక స్థాయిలో మిథనాల్ ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికల ద్వారా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి, సాగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి రాజేంద్ర శుక్లా తెలిపారు. కల్తీ మద్యం మూలం, పంపిణీపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు సాగర్ జిల్లా సరిహద్దులో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ జిల్లా కేంద్రంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు నకిలీ లేబుళ్లు, మూతలను ఉపయోగించి, అసలైన మద్యంలా కనిపించేలా నకిలీ మద్యాన్ని తయారు చేసినట్లు ఆరోపించారు.
అయితే సాగర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలకు కల్తీ మద్యాన్ని నిందితులు సరఫరా చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో లలిత్పూర్ నుంచి సాగర్ జిల్లాకు కల్తీ మద్యం ఎలా రవాణా చేశారు? ఎవరు పంపిణీ చేశారు? ఈ ముఠాకు స్థానిక వ్యక్తులు సహాయం చేశారా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న అనుమానితులను గుర్తించి అరెస్టు చేసేందుకు పలుచోట్ల రైడ్స్ నిర్వహిస్తున్నారు.