బెంగళూరు, డిసెంబర్ 22: అసలే కరువు.. అన్నదాతలు అల్లాడిపోతున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల అమలుకు తీవ్ర నిధుల కటకట.. ఇతర పథకాల నిధుల మళ్లింపు.. వేతనాల ఖర్చు మిగులుతుందని ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్న పరిస్థితి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారిపోతుంటే కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం విలాసాల్లో మునిగి తేలుతున్నారు. లగ్జరీ ప్రైవేట్ జెట్లలో ప్రయాణం చేస్తూ, రాష్ట్ర ఆర్థిక శాఖపై పెనుభారం మోపుతున్నారు. ఆయనొక్కరే కాదు.. ఆ రాష్ట్ర మంత్రులు కూడా ఆయనతో పాటు లగ్జరీ జెట్లో ప్రయాణం చేస్తున్నారు. పోనీ.. ఎందుకు ప్రయాణిస్తున్నారో తెలుసా? కేంద్రం నుంచి కరువు సహాయ నిధులు అడిగేందుకు! దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
కర్ణాటకలో కరువు దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. వానలు లేక, పంట నష్టం వాటిల్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూలేనంత దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. అయినా, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. తాజాగా, లగ్జరీ ప్రైవేట్ జెట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ప్రయాణించటమే అందుకు నిదర్శనం. సిద్ధరామయ్య సర్కారు తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు అల్లాడిపోతుంటే, విలాసాలు కావాల్సి వచ్చిందా? అని ప్రజలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కారును చెడుగుడు ఆడుతున్నారు. అటు.. ప్రతిపక్ష బీజేపీ కూడా సిద్ధరామయ్య సర్కారుపై ధ్వజమెత్తింది. రైతులు కరువుతో ఇబ్బందులు పడుతుంటే, అధికార కాంగ్రెస్ నేతలు లగ్జరీ విమానాల్లో ప్రయాణం చేస్తున్నారని మండిపడింది.
బీజేపీ విమర్శలకు సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చే క్రమంలో తాను విలాసాలు అనుభవిస్తే తప్పేంటన్న రీతిలో వ్యాఖ్యలు చేయటం గమనార్హం. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర.. సిద్ధరామయ్య లగ్జరీ విమాన వీడియోను పోస్ట్ చేయగా, మరి.. ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి విమానంలో ప్రయాణిస్తున్నారో ముందు చెప్పాలని తిరిగి ప్రశ్నించారు. అయితే, లగ్జరీ ప్రైవేట్ జెట్లో ప్రయాణించటంపైనే విమర్శలు వెల్లువెత్తుతుండగా, తాను చేసింది తప్పేంటన్న రీతిలో జవాబివ్వటంపై నెటిజన్లు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు ఉంటే, ఇలాంటి విలాసాలు అవసరమా? అని నిలదీస్తున్నారు.