BJP-JD(S) – CM Siddaramaiah | మైసూర్ పట్టణాభివృద్ధి సంస్థ (ముడా)కు చట్ట విరుద్ధంగా భూమి కేటాయింపు కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న సీఎం సిద్ధ రామయ్య రాజీనామా చేయాలని బీజేపీ, దాని మిత్రపక్షం జేడీఎస్ డిమాండ్ చేశాయి. ఇందుకోసం బీజేపీ, జేడీఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల ‘మైసూర్ చలో’ యాత్ర శనివారం ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, జేడీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ఆధ్వర్యంలో యాత్ర మొదలైంది. డమ్స్ బీట్స్ మధ్య ప్రారంభమైన ‘మైసూర్ చలో’ యాత్ర ఈ నెల 10న మైసూర్ లో భారీ బహిరంగ సభతో ముగుస్తుంది.
‘మైసూర్ చలో’ కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నేత బీవై యెడియూరప్ప ప్రారంభిస్తూ.. ఈ కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న సీఎం సిద్ధరామయ్య వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘ఆయన సొంతంగా రాజీనామా చేయడం సిద్ధరామయ్యకు మంచిది. రాజీనామా చేస్తే ఆయనకే గౌరవం మిగులుతుంది’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీలో విపక్ష నేత ఆర్ అశోక మాట్లాడుతూ.. ‘ఈ అంశంలో సీఎం సిద్దరామయ్యకు నోటీసు ఇచ్చినందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. గవర్నర్ నోటీసు ఇచ్చిన తర్వాత మీ (సిద్ధరామయ్య)లో వణుకు మొదలైంది. సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు ఆయన (గవర్నర్) అనుమతి ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరైనా ఊహించొచ్చు’ అని చెప్పారు.
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి గురించి కాంగ్రెస్ పార్టీ కబుర్లు చెబుతుందన్నారు. కానీ ముడా, వాల్మికీ కార్పొరేషన్ కుంభకోణాలు వెలుగు చూడటంతోనే వారి ‘దళిత వ్యతిరేక’ వైఖరి స్పష్టమైందన్నారు. కొన్ని నెలల్లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం పతనం అవుతుందని జోస్యం చెప్పారు.
తనపై వచ్చిన ఆరోపణలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘అవినీతికి బీజేపీ గ్రాండ్ ఫాదర్’ అని ఎద్దేవా చేశారు. ‘ఒకవేళ అవినీతికి తాత ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ. 40 శాతం అవినీతి ఎవరిదని అంటే బీజేపీది అని మాత్రమే సమాధానం వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీ కెంపన్న మాట్లాడుతూ గత బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్లు తీసుకున్నదని ఆరోపించారని గుర్తు చేశారు.
తమ ప్రభుత్వం కొన్ని రోజుల్లోనే పతనం అవుతుందని జోస్యం చెప్పిన కుమారస్వామి ఇంకెన్ని రోజులు కేంద్ర మంత్రిగా ఉంటారో చూద్దాం అని ఎద్దేవా చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 136 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు దీవించారని, 2018 ఎన్నికల్లో వారు 37 స్థానాలు గెలుచుకున్నారని, ఇప్పుడు వారి బలం 19కి పడిపోయిందన్న సంగతి కుమారస్వామి గుర్తు పెట్టుకోవాలన్నారు.