Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కుటుంబ, వారసత్వ ఎన్నికల రాజకీయాల్ని బీజేపీ కొనసాగిస్తున్నది. మూడో జాబితాలో పది నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. వారిలోముగ్గురు కుటుంబ రాజకీయాల నుంచి వచ్చినవారే. హెబ్బళ నియోజకవర్గం అభ్యర్థి కట్ట జగదీశ్ తండ్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడు భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మాజీ మంత్రి. ఇద్దరూ అవినీతి ఆరోపణలకు గురై కొంతకాలంపాటు జైలుకు వెళ్లారు. కొప్పళ అభ్యర్థి మంజుల అమరేశ్ మామ కొప్పళ లోక్‌సభ సభ్యుడు కరడి సంగణ్ణ. పార్టీ టికెట్ దక్కకపోవటంతో పదవికి రాజీనామా చేసి జేడీఎస్‌లో చేరుతానని హెచ్చరించారు. దాంతో బీజేపీ అధిష్టానం ఆయన కోడలుకు టికెట్ ఇచ్చింది. మహదేవపుర అభ్యర్థి మంజుల భర్త ప్రస్తుత శాసన సభ్యుడు అరవింద లింబావళి, ఆయన పలు అవినీతి, లైంగిక నేరారోపణల్ని ఎదురొంటున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సంకేతాల్ని పంపారు. చివరకు ఆయన భార్యకు టికెట్ వచ్చింది.
హత్య కేసులో నిందితుడికి బీజేపీ టికెట్
హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎన్ చంద్రను శివాజీనగర స్థానంలో బీజేపీ బరిలో నిలిపింది. ఇనుప గనుల తవ్వకాల అధికారి, చెరువుల అభివృద్ధి అధ్యక్షుడు అయిన అటవీశాఖ, చీఫ్ కన్సర్వేటర్ యువీ సింగ్‌పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఎన్ చంద్ర ప్రధాన నిందితుడు. న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతున్నది.
టెండర్ల ప్రక్రియ నిలుపుదల
ఎన్నికల మార్గదర్శకాలు అమల్లో ఉన్నందున అభివృద్ధి పథకాల టెండర్ల ప్రక్రియను కొనసాగించరాదని, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ కొత్త టెండర్లు పిలవరాదని కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంచనా వ్యయం, గడువు నిర్ణయించకుండా ఎన్నికల ప్రకటన వెలువడక ముందు బీజేపీ సర్కార్ రూ.16, 516 కోట్ల విలువ చేసే ఐదు టెండర్లు ఆహ్వానించింది. కొన్ని టెండర్లను హడావిడిగా నిర్వహించారని విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.