బెంగళూరు: పార్టీ ఎమ్మెల్యేకు బీజేపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. (Show Cause Notice) పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. గతంలో అనేకసార్లు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ తీరు మారకపోవడాన్ని విమర్శించింది. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, ఆ రాష్ట్రంలోని పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. రాష్ట్ర స్థాయి పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మీ తిరుగుబాటు, పార్టీ ఆదేశాలను ధిక్కరించడం కొనసాగుతున్నదని విమర్శించింది. రాజకీయ, ప్రజా ప్రాముఖ్యత విషయాలపై పార్టీ అధికార వైఖరికి విరుద్ధంగా బహిరంగ ప్రకటనలు చేయడం, మీడియా సమావేశాలు నిర్వహించడాన్ని తప్పుపట్టింది.
కాగా, పార్టీలో సీనియారిటీ, సుదీర్ఘ కాలం ఉన్న దృష్ట్యా గతంలో సమర్పించిన వివరణలపై కేంద్ర క్రమశిక్షణా సంఘం ఉదాసీనంగా వ్యవహరించిందని బీజేపీ తెలిపింది. గతంలో అనేకసార్లు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ, సత్ప్రవర్తనపై మీరు హామీ ఇచ్చినప్పటికీ, క్రమశిక్షణా రాహిత్య చర్యలు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మీపై పార్టీ ఎందుకు క్రమశిక్షణా చర్య తీసుకోకూడదో అన్నది ఈ నోటీసు అందిన పది రోజుల్లో వివరణను ఇవ్వాలని షోకాజ్ నోటీస్‌లో పేర్కొంది.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ ఇటీవల వక్ఫ్ బిల్లు సవరణలపై ప్రజా చైతన్య ప్రచారాన్ని ప్రతిపాదించారు. దీనిపై సొంతంగా కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు. అయితే పలువురు పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
కాగా, 2023 డిసెంబర్లో యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా తొలి వేవ్ సమయంలో యడియూరప్ప ప్రభుత్వ హయాంలో రూ.40,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అలాగే తనను పార్టీ నుండి బహిష్కరిస్తే ఈ అక్రమాలను బయటపెడతానని ఆయన హెచ్చరించారు.