న్యూఢిల్లీ/ హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ 72 మంది సభ్యుల పేర్లతో రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, మనోహర్ లాల్ ఖట్టర్, త్రివేంద్ర సింగ్ రావత్.. తదితరులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇప్పటివరకు మొత్తం 265 లోక్సభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో 6 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ నేతగాని, మెదక్ నుంచి రఘునందన్ రావు, నల్లగొండ లోక్సభకు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఆదిలాబాద్ గోడెం నగేష్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ పేర్లను పార్టీ ప్రకటించింది. ఆరుగురు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.