Kharge : బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar) గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయను మెంటల్లీ రిటైర్డ్ (Mentally retired) వ్యక్తిగా పేర్కొన్నారు. ఇవాళ బీహార్ రాజధాని పట్నా (Patna) లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీకి మెంటల్లీ రిటైర్డ్ నితీశ్ కుమార్ దొరికారని, బీహార్లోని సంకీర్ణ ప్రభుత్వ తప్పిదాలు అన్నింటికీ ఆయనను జవాబుదారిని చేస్తున్నారని విమర్శించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మోదీ ప్రభుత్వ అవినీతి పాలన అంతానికి ఆరంభం కానున్నాయని మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు ఓట్ల చోరీకీ పాల్పడుతున్నదని, ఆర్థికవ్యవస్థ మందగమనానికి కారణమైందని, దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, నియంతృత్వం రాజ్యమేలుతోందని, రాజ్యాంగబద్ధమైన సంస్థలను బలహీనం చేశారని ఆయన విమర్శించారు. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు.
బీహార్లో ఎన్డీఏ సంకీర్ణ సర్కారు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని అన్నారు. ఆ రాష్ట్రంలో నిరుద్యోగం 15 శాతానికి పెరిగిందని చెప్పారు. యువతకు ఉపాధి కరువై వలసలు వెళ్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే బీహార్లో 10 పాయింట్ ఫార్ములాను అమలు చేస్తామని, అది బీహార్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపనుందని చెప్పారు.