న్యూఢిల్లీ, నవంబర్ 6: మేం చేస్తే సంసారం.. మీరు చేస్తే వ్యభిచారం.. మీరు ఏం చేసినా అక్రమమే.. మేం చేసేది మాత్రమే సక్రమం.. ఇదీ బీజేపీ తీరు. రాజకీయ పార్టీల ‘ఉచిత’ హామీలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని సాక్షాత్తు ప్రధానమంత్రే ప్రతి మీటింగ్‌లో గగ్గోలు పెడుతారు. ఆయన అలా అనగానే బీజేపీ నేతలంతా తానతందానా అంటూ ఊదరగొడుతుంటారు.
కానీ, ఎక్కడైనా ఎన్నికలు వచ్చేసరికి మాత్రం అందరికంటే ముందు బీజేపీయే ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తుంటుంది. మొన్న గుజరాత్లో, నేడు హిమాచల్‌ప్రదేశ్‌లో అదే పని చేసింది. మహిళలకు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు.. 16 ఏండ్ల లోపు విద్యార్థినులకు సైకిళ్లు, రైతులకు రూ.3 వేలు ఇస్తామని ఆదివారం విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ప్రకటించింది. ప్రధాని మోదీ దృష్టిలో ఇవన్నీ ఉచితాలు కావా? లేక బీజేపీ ప్రకటించింది కాబట్టి అవి ఉచితాల కిందికి రావా? అన్న ప్రశ్నలు ప్రజలు సంధిస్తున్నారు.
బీజేపీ మ్యానిఫెస్టోలో ఏమున్నది?
సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదివారం మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అందులో బీజేపీ 11 హామీల్లో ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, ఉచిత సైకిళ్లు, రైతులకు డబ్బులు.. ఇలా అనేక ఉచితాలు ఉన్నాయి. ఈ ఉచితాలను నడ్డా సమర్థించుకొన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కంటే తమదే అద్భుతమని పేర్కొన్నారు. తమవి ఉచిత హామీలు కాదని, అన్నీ ప్రజాభివృద్ధి కోసమే ఇస్తున్నామని సెలవిచ్చారు.
విపక్షాలవి ఉచితాలు ఎట్లయితవి?
బీజేపీ, ప్రధాని మోదీ తీరుపై విపక్షాలు, మేధావులు మండిపడుతున్నారు. విపక్షాలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను మిఠాయిలుగా పదేపదే అభివర్ణిస్తున్న ప్రధాని మోదీ.. తన పార్టీ ఇస్తున్న ఉచితాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆ రాష్ట్ర మంత్రి ఒకరు ‘ఏటా కుటుంబానికి మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. ఉచితాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని, ఉచితాలతో ట్యాక్స్‌పేయర్స్ ఆవేదన చెందుతున్నారని సెలవిచ్చిన ప్రధాని సొంత రాష్ట్రంలోనే, సొంత పార్టీయే ఉచిత హామీలు ఎలా ఇస్తుందని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ పథకాలు కాపీ
బీజేపీ మరోసారి తెలంగాణ పథకాలను కాపీ కొట్టింది. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన మ్యానిఫెస్టోలో తెలంగాణలోని కల్యాణలక్ష్మి, టీహబ్, రైతుబంధు పథకాలను అనుసరిస్తూ కొత్త పథకాలను ప్రకటించింది. ముఖ్యమంత్రి షగున్ యోజన పథకం పేరుతో పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం రూ.51 వేలు ఇస్తామని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ముఖ్యమంత్రి అన్నదాత సమ్మాన్ నిధి పేరుతో రైతులకు ఏటా రూ.3 వేలు ఇస్తామని వెల్లడించారు. అలాగే ‘హెచ్ఐఎం స్టార్టప్’ పేరుతో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి ఊతమిచ్చేందుకు రూ.900 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
నవంబర్ 6, 2022
మాకు ఓట్లేసి గెలిపిస్తే పేద మహిళలకు ‘దేవి అన్నపూర్ణ యోజన ’పేరుతో మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 12-16 ఏండ్ల మధ్య ఉన్న విద్యార్థినులకు సైకిళ్లు ఉచితంగా ఇస్తాం. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న రూ.6 వేలకు అదనంగా మరో రూ.3 వేలు ఇస్తాం. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ.51 వేలు ఇస్తాం.
– హిమాచల్‌ప్రదేశ్ మ్యానిఫెస్టోలో బీజేపీ హామీలు
ఈ దేశంలో ఓట్ల కోసం మిఠాయిలు (ఉచితాలు) పంచి పెట్టే సంస్కృతి బాగా ప్రబలిపోయింది. ఇది దేశాభివృద్ధికి ప్రమాదం. ఇలాంటి ఉచితాలు ఇచ్చే సంస్కృతిని యువత అడ్డుకోవాలి.
– ప్రధాని నరేంద్రమోదీ జూలై 16, 2022
పన్ను చెల్లింపుదారులు కష్టపడి సంపాదించి కడుతున్న పన్నుల డబ్బును కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచితాల రూపంలో పంచిపెడున్నాయి. దీంతో ట్యాక్స్ పేయర్స్ ఎంతో ఆవేదన చెందుతున్నారు. మేం మాత్రమే కోట్లమంది ప్రజల కోసం పన్నుల సొమ్మును సద్వినియోగం చేస్తున్నాం.
– ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 24, 2022