మెహ్సానా, సెప్టెంబర్ 16: దేశంలో అవినీతి అంతం చేస్తాం.. 2014కు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. కానీ, తన పార్టీలోనే, తన రాష్ట్రంలోనే, తాను సీఎంగా ఉన్నపుడే వందల కోట్ల కుంభకోణం జరిగితే మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. అంతేకాదండోయ్.. స్కామ్‌కు పాల్పడిన నిందితుడికి కండువా కప్పి పార్టీలోకి ఆయనే స్వయంగా ఆహ్వానించారు. గుజరాత్ మాజీ హోంమంత్రి విపుల్ చౌదరి రూ.800 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. మెహ్సానా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ (దూద్‌సాగర్ డెయిరీ)కు 2005-2016 మధ్య విపుల్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో భారీ స్థాయిలో స్కామ్‌లకు పాల్పడ్డారని ఏసీబీ తెలిపింది. ఆయనను అరెస్టు చేసి, కోర్టులో శుక్రవారం హాజరుపరచగా 7 రోజుల కస్టడీ విధించింది. అయితే, విపుల్ చౌదరి డెయిరీ చైర్మన్‌గా ఉన్నపుడు గుజరాత్ సీఎంగా ఉన్నది మోదీయే. 2007లో మోదీ సమక్షంలోనే ఆయన బీజేపీలో చేరారు. ఇప్పటికీ ఆ పార్టీలోనే ఉన్నారు.
బోగస్ కంపెనీలు.. షరతుల ఉల్లంఘనలు
విపుల్ చౌదరి చేసిన కుంభకోణాల వివరాలను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మకరంద్ చౌహాన్ వెల్లడించారు. డెయిరీ చైర్మన్‌గా విపుల్.. పెద్ద మొత్తంలో పాల కూలర్లను, గన్నీ సంచులను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లలో ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలు పాటించలేదు. టెండరు షరతులను ఉల్లంఘిస్తూ రూ.485 కోట్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. డెయిరీ ప్రచార బాధ్యతలను తనకు నచ్చిన వాళ్లకు అప్పగించారు. ఓ కేసులో న్యాయవాది ఖర్చులను కూడా పాల ఉత్పత్తిదారుల సంఘం నుంచే వసూలు చేశారు. స్కామ్‌ల డబ్బును 31 బోగస్ కంపెనీలకు మళ్లించారు. వాటికి డైరెక్టర్లుగా తన భార్య, కొడుకునే నియమించారని ఏసీబీ తెలిపింది. డెయిరీ డబ్బును స్వాహా చేసినందుకు మే లో విపుల్, ఆయన వ్యక్తిగత కార్యదర్శిపై ఏసీబీ మోసం, ఫోర్జరీ తదితర కేసులు నమోదు చేసింది.