రాజ్కోట్, మే 29: గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం రాజ్కోట్ జిల్లాలోని ఆట్కోట్ పట్టణంలో ఓ ట్రస్టు నిర్మించిన దవాఖానను ప్రారంభించారు. అనంతరం భారీయెత్తున సభ నిర్వహించారు. అయితే ఈ సభలో వేలాది మంది మహిళలు ఒకేవిధమైన చీరలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఉన్న మర్మం ఏంటా? అని ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్ ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ ప్రతినిధులు ఆరా తీస్తే మోదీ సభ కోసం జనాలను రప్పించేందుకు బీజేపీ నేతలు మహిళలకు చీరల మంత్రం వేసినట్టు తెలిసింది.ఆట్కోట్తో పాటు సమీప గ్రామాల్లోని మహిళలకు దాదాపు 50 వేల చీరలు, స్టీల్ బిందెలను ఉచితంగా పంచిపెట్టి సభకు వస్తామని ప్రమాణాలు చేయించుకున్నారు. సభలో జనాలు ఎక్కువ మంది కనిపించకుంటే తమ నాయకుడు ఎక్కడ గుస్సా అవుతారోననే ఆందోళనతో బీజేపీ నేతలు ఈ తంతు నిర్వహించారు.
ముందు రోజు చీరల పంపిణీ ప్రోగ్రామ్..
సభకు ముందు రోజు అంటే శుక్రవారం.. బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఉచితంగా చీరలు పంచిపెట్టారు. సభ కోసం 50 వేల చీరలు పంచామని సాక్ష్యాత్తూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్ బోఘ్రా వెల్లడించారు. తమ వార్డు నుంచి కేవలం నాలుగు బస్సులు మాత్రమే నిండుతాయని ఆందోళన చెందామని, కానీ చీరల పంపిణీ వలన 11 బస్సులు నిండాయని ఓ నేత తెలిపారు.