లక్నో: సమాజ్వాదీ పార్టీ హయాంలో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు, మద్దతుదారులు అవినీతికి పాల్పడ్డారంటూ వారి ఇండ్లలో ఇవాళ ఐటీశాఖ సోదాలు చేస్తున్నది. ఈ సోదాలపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ( Akhilesh Yadav ) తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై సెంట్రల్ ఏజెన్సీలను ఉసిగొల్పి బెదరగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఈ విషయంలో నాడు కాంగ్రెస్ చేసిన పనే నేడు బీజేపీ చేస్తున్నదని విమర్శించారు.
బీజేపీ గత ఎన్నికల సందర్భంగా యూపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, ప్రస్తుతం మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు సమాజ్వాది నేతలు, మద్దతుదారులపై సెంట్రల్ ఏజెన్సీలను ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు. లౌకికత్వంతోనే రామరాజ్యం సాధ్యమని, రామరాజ్యం రావాలంటే లౌకికత్వం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.