న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యను బీజేపీ పరిష్కరించలేదని, బురద రాజకీయాలే తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని చంపుతుండటంపై నిరసనగా ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘జన ఆగ్రహ ర్యాలీ’ని ఆప్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 1990లో ఏం జరిగిందో ప్రస్తుతం అలాంటి పరిస్థితులను కశ్మీరీ పండిట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. అప్పటి మాదిరిగా కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కశ్మీరీ పండిట్ల హక్కులను హరిస్తున్నారని, వారిని నిరసన చేయనీయడం లేదని విమర్శించారు. దయచేసి కశ్మీర్‌పై రాజకీయాలు చేయెద్దు అని బీజేపీకి సూచించారు. కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనే యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే పొరుగున ఉన్న దాయాది దేశమైన పాకిస్థాన్ తీరుపైనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి ఆ దేశం మద్దతిస్తుండటాన్ని విమర్శించారు. చీఫ్ ట్రిక్కులు ఆపాలన్నారు. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు.