BJP : పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) రెండో విడత పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో డైమండ్ హార్బర్ (Daimond Harbour) లోని ఫల్తా నియోజకవర్గం (Falta Constituency) లో పలు పోలింగ్ బూత్‌లలో ‘కమలం గుర్తు (Lotus Symbal)’ కనిపించకుండా చేసి, ఓటేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని బీజేపీ (BJP) ఆరోపించింది. ఓటింగ్ యంత్రంలో కమలం గుర్తు దగ్గర ఉన్న బటన్‌ను వినియోగించకుండా దానిని టేప్‌తో కప్పి ఉంచినట్లు బీజేపీ పశ్చిమబెంగాల్ కో-ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ (Amit Malaviya) అన్నారు.
ఇందుకు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేయడానికి తృణమూల్ నేతలు స్థానిక అధికారుల సాయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అమిత్ మాలవీయ ఆరోపించారు. ఈ ఘటనలు జరిగిన అన్ని బూత్‌లలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో డైమండ్ హార్బర్ స్థానం నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి కూడా టీఎంసీ ఇదే వ్యూహాన్ని అవలంభించిందని ఆరోపించారు.
ఇతర పోలింగ్ బూత్‌లలోని పరిస్థితులను తమ పార్టీ పర్యవేక్షిస్తోందని చెప్పారు. పోలింగ్ బూత్‌లలో బటన్ల ట్యాంపరింగ్‌పై వచ్చిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. అవి నిజమని తేలితే ప్రభావిత బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్‌లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.